మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు
భవన నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఉత్తర తెలంగాణ యువతకు నిర్మాణ రంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు
హైదరాబాద్/పెద్దపల్లి,(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ యువతను నిర్మాణ రంగంలో గ్లోబల్ ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు మంథని వేదిక కానుంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మంథని నియోజకవర్గానికి ఈ భారీ కేంద్రాన్ని తీసుకురావడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన కృషి ఫలించింది.
యువతకు ఉపాధి వారధి: మంత్రి శ్రీధర్ బాబు
న్యాక్ సెంటర్ మంజూరు కావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మంథని ప్రాంత యువతకు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, అంతర్జాతీయ నైపుణ్యాలను ఇక్కడి యువత ఉచితంగా నేర్చుకునే అవకాశం దక్కుతుంది.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు స్వయం ఉపాధితో పాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఈ కేంద్రం ఒక గొప్ప వారధిగా నిలుస్తుందని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని మంథనికి కేటాయించినందుకు గానూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణ
ఈ న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా నిర్మాణ రంగానికి అవసరమైన అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ స్థాయి ల్యాబ్‌లు, ఆధునిక యంత్రాలతో కూడిన శిక్షణా సౌకర్యాలను ఇక్కడ కల్పించనున్నారు. రూ. 20 కోట్ల నిధులతో నిర్మించబోయే ఈ భవన పనులను త్వరలోనే ప్రారంభించి, వీలైనంత వేగంగా యువతకు అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంథని ప్రాంత రూపురేఖలను మార్చేలా ఐటీ, పరిశ్రమలతో పాటు ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీసుకురావడం పట్ల స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.






