ఏజెన్సీ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
* ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకుల డిమాండ్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల హక్కులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పిఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆదివాసి విద్యార్థి సంఘం నాయకుడు పేందూరు సంతోష్, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు సోమేశ్ జాదవ్, పెందుర్తి దీపక్ లు మాట్లాడుతూ..
ముఖ్యంగా సిఆర్టి (CRT) నియామకాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, అర్హతలు లేని, అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, ఏజెన్సీ ప్రాంతాల గిరిజన విద్యార్థులకు గురుకుల పాఠశాలలు మరియు గురుకుల కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని, ఆర్జేసీ (RJC) మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లను కొనసాగించాలని కోరడం జరిగింది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే ప్రత్యేక గిరిజన డీఎస్సీ నిర్వహించాలని, ఐటీడీఏ పరిధిలోని 29 శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేయడం చేశారు.అలాగే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన అన్ని ఖాళీ ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, ఎల్‌టిఆర్ మరియు ఇతర గిరిజన రక్షణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






