భక్తి పారవశ్యంలో మడేలేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి జాతర మహోత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్న సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రాంత ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం జాతర ప్రాంగణంలో భక్తుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన నూతన హ్యాండ్‌బోర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, దేవాలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాతరకు విచ్చేసిన భక్తులను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ మడేలేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జాతరలో భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






