24 July, 2026 | 2:45 AM

వసతిగృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

24-07-2026 12:29 AM

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

చిన్న శంకరంపేట/చేగుంట జులై 23: వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం చిన్న శంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ స్థానిక ఎస్సీ  బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్లను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వలు, పరిశుభ్రతను తనిఖీ చేయడంతో పాటు డ్రైనేజీ, మరుగుదొడ్లు, ఇతర వసతులపై ఆరా తీశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. మరుగుదొడ్లు, గదుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, మొక్కలను క్రమపద్ధతిలో పెంచాలని సూచించారు. ప్రభుత్వం నుంచి మంజూరైన ఇంటిగ్రేటెడ్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ వసతులను సమర్థవంతంగా మెరుగుపరచాలని, గదుల్లో వెలుతురు సరిపడా ఉండేందుకు అదనంగా ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాస్టల్లోకి బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తులసీరామ్, ఎంపీడీవో దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.