ఢిల్లీలో 16 మెట్రోస్టేషన్ల మూసివేత
జోక్యం చేసుకోవాలని సీజేఐకి ఎస్‌సీబీఏ విజ్ఞప్తి
జోక్యం చేసుకుంటామన్న సీజేఐ సూర్యకాంత్
న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకేజీ అంశంపై న్యూఢిల్లీలో కొనసాగుతున్న సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీలోని 16 మెట్రోస్టేషన్లను గురువారం అధికారులు మూసివేశారు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం, ఇబ్బంది ఏర్పడింది.
దీన్ని తప్పుబట్టిన పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింహకు విషయాన్ని తెలిజేశారు. దీంతో అధ్యక్షుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మెట్రోస్టేషన్ల మూసివేతతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సామాన్య ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
దీనిపై జోక్యం చేసుకోవాలని, వెంటనే మెట్రోస్టేషన్లను యథావిధిగా తెరిచి రైలు ప్రయాణాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. సీజేఐ స్పందిస్తూ.. మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, సమస్య పరిష్కారం కాకుంటే జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు. మూసివేసిన స్టేషన్లలో లోక్‌కళ్యాణ్ మార్గ్, రాజీవ్‌చౌక్, పటేల్‌చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సచివాలయం, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియంలున్నాయి.






