24 July, 2026 | 2:29 AM

విద్యార్థులకు ఇండి కూటమి మద్దతు

24-07-2026 01:22 AM
  1. రాహుల్ గాంధీ నివాసంలో అత్యవసర భేటీ
  2. పార్లమెంట్ వ్యూహాలపై సుదీర్ఘ చర్చలు 
  3. విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు.. 
  4. అందుకే మేం కూడా వీధుల్లోకి వచ్చాం: రాహుల్ 
  5. గాంధీ స్మృతి కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన 
  6. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి

న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకేజీలో బాధ్యులపై చర్యల కోసం, విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా సీజేపీ, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని విపక్ష కూటమి (ఇండి అలియన్స్) నిర్ణయించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నివాసంలో గురువారం ఇండి కూటమి అత్యవసర భేటీ అయ్యింది. అనంతరం అక్కడి నుంచి గాంధీ స్మృతి కేంద్రం వరకు బస్ కాన్వాయ్ ర్యాలీ నిర్వహించింది.

నీట్ పేపర్ లీక్ వల్ల మృతిచెందిన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. విద్యార్థులు వంటరిగా లేరని, వారికి ‘మేమంతా అండగా ఉంటాం’ అని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే, ప్రియాంకగాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీ చిదంబరం, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ(ఎం), ఆర్‌ఎస్పీ, ఇతర ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు.

సీజేపీ నిరసనలకు మద్దతుపై, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కూటమి ఎంపీలు.. విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ ఢిల్లీలోని గాంధీ స్మృతి కేంద్రం వరకు ఇండి కూటమి ఎంపీల బృందం బస్ కాన్వాయ్ ర్యాలీ నిర్వహించారు. దీనికి రాహుల్ గాంధీ  నేతృత్వం వహించారు. ఎంపీలతో కూడిన మూడు బస్సుల కాన్వాయ్‌ను రాహుల్ గాంధీ నివాసం వెలుపల ఢిల్లీ పోలీసులు నిలిపేశారు.

దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ముందుకు వెళ్లడానికి అనుమతించారు. కాన్వాయ్, బస్సులు కొన్ని మీటర్లు మాత్రమే ముందుకు వెళ్లగా పోలీసులు మళ్లీ ఆపివేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ‘మా విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. అందుకే మేము కూడా వీధుల్లోకి వచ్చాం.

మేము గాంధీ స్మృతి కేంద్రానికి వెళ్తుండగా మమ్మల్ని అడ్డుకున్నారు. మా ఎంపీలందరూ అక్కడికి వెళ్లాలనుకున్నారు. కానీ అనుమతి నిరాకరించారు. ఇక్కడ బస్సులను నిలిపివేశారు. అందుకే మేము ముందుకు వెళ్లలేకపోతున్నాం’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ కూడా పోలీసుల చర్యను ప్రశ్నించారు. ‘పార్లమెంటు లోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్నవారు గాంధీ స్మృతికి వెళ్లలేరా? ఈ బారికేడ్లు ఎందుకు? మేమేమైనా గూండాల మా లేక నేరగాళ్లమా?‘ అని ఆయన పేర్కొన్నారు.

దీంతో మళ్లీ కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసులు బారికేడ్లను తొలగించి, గాంధీ స్మృతి వైపు కాన్వాయ్‌ను వెళ్లనిం చారు. మార్గమంతా భారీ బందోబస్తు కల్పించారు. తర్వాత గాంధీ స్మృతి కేంద్రానికి చేరుకొని కొవ్వొత్తులో ప్రదర్శన చేపట్టారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించారు.

విద్యార్థులకు అండగా మేమంతా: రాహుల్‌గాంధీ

గాంధీ స్మృతి కేంద్రం వద్ద రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు ఒంటరి వారు కాదని, వాళ్లకు అండగా ఉంటామని ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను గౌరవించడానికి, నిరసనల సమ యంలో గాయపడిన వారికి అండగా నిలవడానికి ఇండియా కూటమి గాంధీ స్మృతిని సందర్శించిందని రాహుల్ గాంధీ తెలిపారు. శాంతియుతంగా న్యాయం, జవాబుదారీతనం కోసం దెబ్బలు తిని, నేడు గాయపడిన విద్యార్థులకు ‘మేము అండగా నిలుస్తాం’ అని అన్నారు. భారతదేశ విద్యార్థులు ఒంటరిగా లేరని, వారికి, వారి డిమాండ్లకు ప్రతిపక్షమంతా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.