24 July, 2026 | 2:21 AM

నేడు సీజేపీ దేశవ్యాప్త నిరసనలు

24-07-2026 01:09 AM

న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నెల 20న ఢిల్లీ ఆందోళనల్లో పోలీసుల చర్యల వల్ల ప్రభావితమైన విద్యార్థులకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గురువారం పేర్కొంది. అలాగే కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని, విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని సీజేపీ స్పష్టం చేసింది. పేపర్ లీకేజీల నియంత్రణకు, భవిష్యత్తులో ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నప్పటికీ సీజేపీ నాయకులు, విద్యార్థి ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు, హామీలు కేవలం కాలయాపనకే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాల ని, ఆందోళనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేశవ్యాప్త నిరసన తలపెట్టింది.

దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించేందుకు సీజే పీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలుపునిస్తున్నా, మరోవైపు నిరసనలు ఉధృతం కానుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.