24 July, 2026 | 2:21 AM

గ్లోబరీనా కేటీఆర్ బినామీనే!

24-07-2026 01:13 AM
  1. ‘గ్లోబరీనా’ కార్యకలాపాలపై సమగ్ర విచారణ అవసరం 
  2. ప్రధాన్ రాజీనామాకు బీఆర్‌ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు 
  3. నాకు రెండు ఓట్లుంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు 
  4. ‘సర్’లో ఓట్లు పోతే పథకాలు, ఆధార్ ఉండవు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
  5. కమీషన్లు తీసుకున్నాడనే హరీశ్ శాఖ మార్చారు 
  6. బీజేపీ నేతల్లో ఒకరంటే ఒకరికి పడదు 
  7. మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : గ్లోబరీనా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించిన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గ్లోబరీనాపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని సీఎం స్పష్టం చేశారు. గతంలో ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

గ్లోబరీనా పేరు మార్చుకుని ఇతర పరీక్షల కాంట్రాక్టులు పొందిందని, వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందని, ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబరీనా విషయంలో చోటు చేసుకున్న తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ‘పరువు ఉన్నవాడే పరువు నష్టం దావా వేస్తాడు.

కేటీఆర్ ఫిర్యాదు చేస్తే జన్వాడ భూములు ఏ రాజుల నుంచి  వచ్చాయో బయటకి తెస్తా. విచారణలో గ్లోబరీనా ఏ రాజులదో బయటకి తెస్తాను’ అని సీఎం పేర్కొన్నారు.  గురువారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. ‘గ్లోబరీనాపై విచారణ చేస్తే కక్ష సాధింపు అంటున్నారు. కేటీఆర్ ఒక్క ఫిర్యాదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నివేదిక వచ్చిన తర్వాత ఏది చేయాలో అది చేస్తాం.

నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా.. నా విధానం కాదు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. బీఆర్‌ఎస్ తప్పులపై విచారణ జరుగుతోంది. నాకు నచ్చలేదని వెంటనే శిక్ష వేయాలా? ’ అని సీఎం పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో శిక్షలను కోర్టులు అవుతున్నాయన్నారు. నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, బీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇందిరాపార్కు వద్ద తాము తెరిచిన ధర్నా చౌక్ లోనే కేటీఆర్ ధర్నా చేస్తున్నాడని, శాంతియుతంగా నిరసనలు చేస్తే పర్మిషన్ ఇస్తామని తెలిపారు. ప్రధాని మోదీ అనుమతి ఇవ్వడం వల్లే బీఆర్‌ఎస్ ధర్నా చేస్తుందన్నారు. కేటీఆర్ బర్త్ డేపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తన పుట్టిన రోజు దావత్ ఇస్తాడో అడగాలని, అయితే కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమోనని, ఆయనవి అన్ని వేరే పార్టీలుంటాయని సీఎం వ్యాఖ్యానించారు.

బీజేపీ నాయకుల మధ్య అంతర్గత కొట్లాటలు ఉన్నాయన్నాని, ఒకరంటే ఒకరికి పడదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పేదలకు ఇచ్చే ఇళ్లను దళారులకు అమ్ముకు న్నారని సీఎం మండిపడ్డారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంటే .. పేదలకు లాభం జరుగుతుందనే అక్కసుతో బీఆర్‌ఎస్ మాట్లాడుతుంతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలు బ్రోకర్లకు అమ్ముకొని దళారీ వ్యవస్థ తెచ్చారని, తాము ఏం చేస్తున్నామో అదే చెబుతున్నామని పేర్కొన్నారు.     

‘సర్’తో కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే కుట్ర

సర్ ప్రకియ వల్ల గ్రామాల్లో దళితులు, గిరిజనులు, అమాయకుల ఓట్లు  పోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఓటు పోతే సంక్షేమ పథకాలు, ఆధార్‌కార్డు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. ఓటరు జాబితా సమగ్ర సరవణ 70 శాతం పూర్తయిందని, మిగిలిన 30 శాతం కీలకమని, అందుకు బీఎల్‌ఏలు  అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా సర్ ప్రక్రియ జరుగుతుందని సీఎం ఆరోపించారు.

సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో ఉండాలన్నారు. ‘నాకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కొందరు తెలిసీతెలియక బలిసి మాట్లాడుతున్నారు. నాకు రెండు ఓట్లు ఉంటే పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు. చట్టపరంగా చర్యలు తీసుకొన లోపల వేస్తారు.

నా ఓటును నా సొంత గ్రామం నుంచి కలెక్టర్ అనుమతితోనే  కొడంగల్‌కు మార్చు కున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలో ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చింది. బీజేపీ కుట్ర పూరితంగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.  

బీఆర్‌ఎస్ నేతలు సీబీఐని మేనేజ్ చేసుకున్నారు

‘హరీశ్ గొప్ప నాయకుడైతే మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారు?. హరీశ్ మ్యానిపులేట్ చేసి వందల కోట్లు సంపాదించాడనే.. ఆయన శాఖను మార్చారు. అతి తెలివి తేటలతో హరీశ్ ఏడిపడితే అది మాట్లాడతా అంటే నడవదు.   కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది వినాలా, వద్దా? ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలంటే పరీక్షలు చేయాలని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎక్కడ ఎత్తి పోయాలి? పంపులు, బిల్లులు, కమిషన్లు కథ అయిపోయింది.

ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారు. మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడ డం లేదు?. మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్‌ఎస్ వాళ్ళే. బీఆర్‌ఎస్ నేతలు సీబీఐని మేనేజ్ చేసుకున్నారని, ఇప్పుడు ఎదురుదాడి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాఫర్ డ్యాం ఎందుకు కట్టలేదు?’ అని సీఎం నిలదీశారు. 

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదు

హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య లేదని సీఎం తెలిపారు. హైడ్రా పనితీరు బాగుందన్నారు. దేవాదుల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చాకనే పనులు చేస్తున్నామని తెలిపారు. ట్రంప్ మనకు పెట్టుబడులు పెట్టాడు కాబట్టి ఆయన పేరు పెట్టామని, ఎవరు పైసలు ఇచ్చిన వారి పేరు మీద పెడతామని సీఎం తెలిపారు. ఆంధ్రావాళ్లు ఏడు మండలాలు తీసుకుని వెళితే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదన్నారు. చట్టబద్ధమైన పాలన చేయడానికి ప్రజలు తమకు అవకాశం ఇవచ్చారన్నారు.

అప్పుడు ప్రాణాలు.. ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారు

‘కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ రక్తదానం చేయలేదు. కేటీఆర్ చుట్టాలు ఎవరైనా రక్తం చేయలేదు. తీసిన రక్తం ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు దోచుకుని, కొవ్వెక్కి ఉన్నవాళ్లు రక్తం ఇస్తే కరిగిపోద్ది. వాళ్లు సేకరించిన రక్తం గాంధీకి, ఉస్మానియాకు ఇస్తే బాగుండు. ఉద్యమంలో ఇలాగే రెచ్చగొట్టారు. ప్రాణాలు తీసుకున్న వాళ్లే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారని మండిపడ్డారు.

చార్లెస్ శోభరాజు, బిల్లా రంగాలు కూడా జైల్లో ఉన్నారు. జైలుకు వెళ్తే ముఖ్యమంత్రులు అవుతారా? అని ఎద్దేవా వేశారు. మా ప్రభుత్వం  ఉద్యోగాలపై చర్చకు నేను సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రశ్నపత్రం అమ్ముకోవాలనేది బీఆర్‌ఎస్ విధానమని, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానమని సీఎం తెలిపారు.

కేసీఆర్  కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయని, పేద విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అన్నవారు ఆ తర్వాత ఏమయ్యారని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఓట్ల లో వచ్చిన ఓట్లు..  పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు రాలేదన్నారు.