30 July, 2026 | 1:14 AM

భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు

30-07-2026 12:19 AM

ముకరంపుర, జూలై 29(విజయ క్రాంతి) కరీంనగర్ నగరంలో మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, నగర ప్రజలకు ఎ లాంటి అసౌకర్యం కలగకుం డా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు నగరంలోని కాశ్మీర్ గడ్డ, ముకరంపుర మరియు భగత్ నగర్ గుండా వెళ్లే ప్రధాన నీటి కాలువ పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలోని దాదాపు 70 శాతం మురుగు మరియు వరద నీరు ఈ ప్రధాన స్ట్రామ్ వాటర్ కాలువ గుండానే వెళుతుందని, రోడ్లపై వరద నీరు చేరకుండా ఈ డ్రైన్ ద్వారానే ప్రవహిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రధాన కాలువ నిర్మాణం జరిగి సుమారు 20 నుండి 25 సంవత్సరాలు గడిచిందని గుర్తుచేశారు.

కాలక్రమేణా కాలువ ఎక్కడైనా దెబ్బతిన్నదా అని అంచనా వేస్తూ, భవిష్యత్తులో దీనికి ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలి అన్న అంశాలపై ఆయన దృష్ఠి సారించారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయా అని తనిఖీ చేశారు. భారీ వర్షాలకు వరద నీరు డ్రైనేజీ నిండుగా ప్రవహిస్తున్నందున, కాలువను దాటి నివాస ప్రాంతాల్లోకి రాకుండా, కేవలం డ్రైన్ లోనే సాఫీగా ముందుకు పోయేలా తీసుకోవాల్సిన అత్యవసర, కట్టుదిట్టమైన చర్యల గురించి ఆయన పరిశీలించారు.