20 July, 2026 | 12:00 AM

సేవాలాల్ సేన నాయకుల ముందస్తు అరెస్ట్

19-07-2026 02:32 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Centre) ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న సేవాలాల్ సేన నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను సేవాలాల్ సేన నాయకులు అప్రజాస్వామికమని ఖండించారు.

సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్‌తో పాటు జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి భూక్యా శ్రీను నాయక్ మాట్లాడుతూ టేకులపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని, బోడు, సిద్దారం, బర్లగూడెం, జంగాలపల్లి, ఒడ్డుగూడెం, రాజారాం తండా, లచ్చగూడెం, గంగారం, కొప్పురాయి, రామచంద్రపేట తదితర గ్రామాల ప్రజలు వైద్య సేవల కోసం సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని సులానగర్ పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

రవాణా సౌకర్యాల లేమితో అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమైన నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు విమర్శించారు. బోడు గ్రామంలో తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలు నాయక్, నరేష్ నాయక్ తదితరులు ఉన్నారు