20 July, 2026 | 5:00 PM

ముస్తాబాద్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కలేనా?

20-07-2026 12:00 AM

సామజిక ఉద్యమ నాయకుడు బాలయ్య

ముస్తాబాద్,జూలై 19(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ కు ఎన్నో సార్లు వినతిపత్రాలు అందజేశామని సామాజిక ఉద్యమ నాయకుడు చింతోజు బాలయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కలేనా.? అని విచారం చేస్తూ...ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడారు.

మండల వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో చదివే వందలాది మంది విద్యార్థులు పదవ తరగతి తర్వాత పై చదువులకు పట్టణాలకు,సుధూర ప్రాంతాలకు వెళ్లి చదివేవారు.ఆర్థికంగా లేని విద్యార్థులు మాత్రం చదువుకు దూరంగా ఉండేవారు.అందరికి విద్య అవసరమని ఎలాగైనా ముస్తాబాద్ లో కళాశాల ఏర్పాటు చేసేలా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టిడం జరిగిందన్నారు

ఆ ఉద్యమ ఫలితమే ముస్తాబాద్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అయింది.ఇప్పుడు ఆ కళాశాలలో ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ కోసం మళ్ళీ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.కాబట్టి ప్రతి యేటా ఇంటర్ తర్వాత డిగ్రీ చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ముస్తాబాద్ లోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.

డిగ్రీ కోసం విద్యార్థులతో ఎన్నోసార్లు నిరసనలు కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదన్నారు.ఆరోగ్యం సహకరించక విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేయలేక ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు పోలేదన్నారు.కొందరి స్వార్థపూరిత ఆలోచనలతో మన ముస్తాబాద్ కు డిగ్రీ కళాశాల మంజూరు కాకుండా అడ్డుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికారులు,నాయకులు చొరవ తీసుకొని డిగ్రీ కళాశాలను మంజూరు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.