20 April, 2026 | 7:42 PM

దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదు

20-04-2026 06:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.  ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. 

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి సంక్షేమ వసతి గృహాల్లో నిర్వహించే సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొనాలని తెలిపారు. అనంతరం ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే-2026 కు సంబంధించి వారోత్సవాల గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.