ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎస్టేట్ జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొంటున్న అధికారులకు సంఘీభావం ప్రకటించారు. ఏడో రోజు దీక్షలో అజ్మీర తుకారం (డీజీఎం–పర్సనల్), ఎం. దేవేందర్ నాయక్ (ఈఈ–ఈ&ఎం), ఎస్. శ్రీనివాస్ (సర్వే ఆఫీసర్, జేకే ఓసీ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, అధికారుల న్యాయమైన డిమాండ్లైన పీఆర్‌పీ, పే స్కేల్ తదితర అంశాల పరిష్కారం కోసం అధికారులు ఐక్యంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల అధికారులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారని, ఇల్లందు అధికారులు క్రమశిక్షణతో, ఐక్యతతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని, వారి సమస్యలను యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి అధికారులను పరామర్శించారు. వారి న్యాయమైన డిమాండ్లు త్వరలోనే పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ, శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అధికారులను అభినందించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సంఘం నాయకులు పాల్గొని దీక్షలో ఉన్న అధికారులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అధికారుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం త్వరిత నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.






