16 August, 2026 | 9:20 PM

మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

16-08-2026 08:16 PM

దేవరకద్ర/అడ్డాకుల: మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవరకద్ర ఎంపిడివో శ్రీనివాస్ రావు, అడ్డాకుల ఎంపీఓ విజయ్ కుమార్ ఒక వేరు వేరు ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు.

మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చని తెలిపారు.  రేషన్, పింఛన్లు, రోడ్లు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయ సంబంధిత సమస్యలు వంటి అనేక అంశాలపై ప్రజలు తమ వినతులను ఇవ్వవచ్చని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై వచ్చిన వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని, అవసరమైన చోట వెంటనే ఫీల్డ్ స్థాయి పరిశీలన కూడా నిర్వహిస్తారని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎంపీఓ వివరించారు. ప్రతి వినతిని నమోదు చేసి దాని పరిష్కార స్థితిని కూడా ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించాలని, సమస్యలను స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంతో మండల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.