ఆగస్టు 19న ఏజెన్సీ బందుకు పిలుపు
తుడుం దెబ్బ తీర్మానం..
ఉట్నూర్, ఆగస్టు 16( విజయక్రాంతి): పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగ యువతకు 75% రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంతో ఈనెల 19న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ నిర్వహించుటకు తీర్మానించినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు పుర్కా బాపురావు అన్నారు. ఉమ్మడి జిల్లా తుడుం దెబ్బ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు పేందూరు దాదే రావు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి సార్ మేడిలు కొట్నాక్ దేవుషా, సలాం శ్యామ్ రావు తో పాటు తుడుం దెబ్బ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. తుడుం దెబ్బ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈనెల 19న ఏజెన్సీ బందును స్వచ్ఛందంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ బందులో ఆదివాసీ సంఘాలు, ఆదివాసి ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతా గిరిజన యువతి, యువకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా యువతీ యువకులు, నిరుద్యోగులు పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ మెస్రం నాగనాథ్, తుడుం దెబ్బ విద్యార్థి సంఘం నాయకులు, సర్పంచులు, వివిధ గ్రామాల్లో పటేల్ లు పాల్గొన్నారు.






