12-02-2026 02:39:58 AM
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
బాన్సువాడలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
ఎల్లారెడ్డిలో పోలింగ్ కేంద్రాలకు ఎమ్మెల్యే వెళ్లడంపై మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆరోపణ, రోడ్డుపై బైఠాయించి నిరసన
బాన్సువాడ 9వ వార్డులో ఉదిరిక్తత
పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్‌కు ఓటేయాలని కానిస్టేబుల్ క్యాంపెయిన్
బిచ్కుందలో ఎమ్మెల్యే వైఖరిపై బిఆర్‌ఎస్ నాయకుల అగ్రహం
కామారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 7:00 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల చెందిన మరికొందరు అభ్యర్థులు పోటీ చేశారు. రసవత్తరంగా పోటీ కొనసాగింది. ప్రచారానికి సమయం తగ్గి ఉండడంతో తమ అనుచరులతో అభ్యర్థులు బృందాలను ఏర్పాటు చేసి ఓటర్లను కలిసి తమ గుర్తులు వివరించి ఓట్లు అడిగారు.
ఉదయమే పోలింగ్ కేంద్రాలకు..
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి లో 49, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో 12, బిచ్కుం దలో 12 వార్డులకు అభ్యర్థులు పోటీ చేశా రు. ప్రచారంలో ఓటర్లను కలిసి తమ కోటు వేయాలని అభ్యర్థులు ప్రాధేయపడ్డారు. మరికొందరు అభ్యర్థులు ఓటర్లను అనుకూలంగా చేసుకునేందుకు డబ్బులు, చీరలు, మధ్యము, చికెన్ బిరియాని, చికెన్ లను అందించారు. తమ భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కావడంతో వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఎన్నిక లు బుధవారం నిర్వహించారు.
ఓట్లు వేసిన ప్రముఖులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎల్లారెడ్డిలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే గంగారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పలుచోట్ల ఘర్షణలు ఆందోళనలు
మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ బుధవారం జరగడంతో జిల్లాలోని పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డి లోని తొమ్మిదవ వార్డులో నకిలీ ఓట్లు కలకలం రేపాయి. ఇతర గ్రామాల నుంచి వచ్చి ఓట్లు వేసేందుకు రావడంతో బిజెపి అభ్యర్థి గుర్తించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో బిజెపి కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోలింగ్ కేంద్రాలకు తమ పీఏలను వెంటబెట్టుకొని రావడంని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహరించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎమ్మెల్యే పి ఎ లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రాలకు స్థానికులే ఓటు హక్కు కలిగిన వారు మాత్రమే రావాల్సి ఉండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పీఏ లు అధికార దుర్వినియోగం చేశారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. బాన్సువాడలోని తొమ్మిదో వార్డులో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కోటు వేయాలని కానిస్టేబుల్ క్యాంపెయిన్ చేయడంతో బిఆర్‌ఎస్ బిజెపి నాయకులు నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.చెదురు మధురు ఘటనలు మినహా మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.
పోలీసుల 5 అంచెల భద్రత
పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరగకుండా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐదు అంచల భద్రత ఏర్పాట్లను చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు, సిబ్బందితో సిబ్బందిని అయిదు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.