7 July, 2026 | 10:19 PM

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలు మానాలి.. అక్రమార్కులపై కఠిన చర్యలు

07-07-2026 08:55 PM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల:  నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అత్యధిక కేసులు నమోదు చేసి అక్రమాలపై ఉక్కుపాదం మోపినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలింపుపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, చట్టపరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారెవరైనా చట్టం ముందు సమానమేనని, ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత ఒత్తిళ్లకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. "మా కుటుంబ సభ్యులు ఎవరూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడరు. ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నేనే అధికారులను కోరుతాను. అక్రమాలకు ఎలాంటి మద్దతు ఉండదు" అని స్పష్టం చేశారు.

జడ్చర్ల నియోజకవర్గంలోని దుందుభి వాగులతో పాటు ఇతర వాగుల్లో ప్రస్తుతం ఇసుక అందుబాటులో లేకపోవడానికి గత పదేళ్లలో జరిగిన విచ్చలవిడి అక్రమ తవ్వకాలే కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని కేసులు నమోదయ్యాయో లెక్కలు పరిశీలించాలని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, నమోదైన కేసుల వివరాలను కూడా ప్రజల ముందుంచాలని సూచించారు.

తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, అక్రమాల నియంత్రణలో ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు కావాలనే తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన కుటుంబ సభ్యులను ఇసుక మాఫియాతో ముడిపెడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాలు, నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మి అపోహలకు గురికావద్దని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.