ముగిసిన పోలీసు క్రీడా సంబురాలు
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో విజయవంతంగా 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్
ఎల్బీనగర్, జూలై 9 : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్ 2026 (క్లస్టర్ - ఏ) రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా విజయవంతంగా నిర్వహించారు. గురువారం క్రీడా పోటీలు ముగిశాయి. క్లస్టర్ - ఏ గ్రూపులో 14 ఇండోర్ పోటీలు ప్రారంభించారు. వీటిలో వ్రెస్టిలింగ్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, ఆర్మ్ వ్రెస్టిలింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా, జుడో, వుస్, త్వుక్విండ్, కరాటే, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, పెన్ కాక్ సిలాట్ పోటీలు నిర్వహించారు.
ఈ క్రీడల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 పోలీస్ యూనిట్ల నుంచి మొత్తం 831 మంది పోలీస్ క్రీడాకారులు(683 మంది పురుషులు, 148 మంది మహిళలు) పాల్గొన్నారు. ఈ పోటీల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ మొత్తం 140 పతకాలు సాధించి ప్రథమ స్థానం దక్కించుకుంది.
ఇందులో 64 గోల్డ్, 44 సిల్వర్, 32 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. టీజీఎస్పీ యూనిట్ - 2 మొత్తం 58 పతకాలతో ద్వితీయ స్థానం సాధించింది. ఇందులో 19 గోల్డ్, 16 సిల్వర్, 23 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. మల్కాజిగిరి కమిషనరేట్ మొత్తం 58 పతకాలు సాధించి తృతీయ స్థానం దక్కించుకుంది. ఇందులో 12 గోల్డ్, 20 సిల్వర్, 26 బ్రాంజ్ పతకాలు ఉన్నాయి. విజేతలకు ఉప్పల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ శ్యామ్ సుందర్, సీనియర్ పోలీస్ అధికారులు పతకాలు అందజేసి, అభినందించారు.






