8 June, 2026 | 3:02 AM

మత్తు వదిలిస్తున్నారు!

08-06-2026 01:05 AM

గంజాయి బ్యాచ్లపై పోలీసుల దాడులు

జిల్లాను జల్లెడ పడుతున్న యంత్రాంగం

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): గంజాయి అంతానికి మహబూబాబాద్ జిల్లా పోలీసులు పంతం పూనారు. గత కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా జల్లెడ పడుతున్నారు. ప్రత్యేక డాగ్ స్క్వాడ్, నార్కోటిక్ నిపుణులు, పోలీసులు ప్రధానంగా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జిల్లా ఎస్పీగా డాక్టర్ శబరిష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్డు ప్రమాదాలను వివరించడానికి ‘హెల్మెట్’ వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ‘సక్సెస్’ సాధించారు. ప్రతి పల్లెలో కూడా ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా ప్రచారం నిర్వహించి విజయవంతం అయ్యారు.  ఈ నేపథ్యంలో జిల్లాలో గంజాయి వినియోగం అరికట్టడం కోసం గంజాయిపై మరో పోరాటం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా గంజాయి సేవించే అనుమానిత ప్రదేశాలను, నిర్జన ప్రదేశాలను, పాడుబడిన భవనాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు.

అలాగే జిల్లా పరిధిలో ఉన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా రాత్రిపూట పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. మఫ్టీలో స్వయంగా ఎస్పీ డాక్టర్ శబరిష్, ఇతర ఉన్నత అధికారులు తనిఖీల్లో పాల్గొంటూ అనుమానస్పద స్థితిలో కనిపించిన యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాగే అక్రమంగా నాటు సారా తయారీ, వినియోగంపై కూడా దృష్టి సారించారు. జిల్లాలో ‘గంజాయి మత్తు’ నిర్మూలించడానికి ప్రత్యేకంగా నాకాబంది నిర్వహిస్తున్నారు.

పోలీసు జాగిలాలతో వాహనాలను, అందులో వస్తువులను తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో ప్రత్యేకంగా తనిఖీ కార్యక్రమం ఆకస్మికంగా నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు.

విద్యాసంస్థలు, యువత అధికంగా గుమి గుడే ప్రాంతాల్లో కిరాణా షాపులు, పాన్ షాపుల్లో గంజాయి విక్రయాలు సాగిస్తున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మకాలు, సేవించడం లాంటి అనుమానం వస్తే వెంటనే పోలీస్ కాల్ సెంటర్ కు సమాచారం ఇవ్వాలంటూ ప్రత్యేకంగా సెల్ ఫోన్ నెంబర్ 8712656999 ఏర్పాటు చేశారు. అలాగే తమ పిల్లలు ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటైతే వాటి నుంచి దూరం చేయడానికి డి అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక టెస్టు కిట్లు

గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై మహబూబాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా గంజాయి, మత్తు పదార్థాలను వినియోగించే వారిని గుర్తించడానికి ప్రత్యేకంగా 4000 టెస్టు కిట్లను మహబూబాబాద్ జిల్లాకు పోలీసులు తెప్పించారు. అనుమానిత ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు తీసుకున్నట్లు అనుమానం వస్తే వెంటనే వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడానికి ఈ టెస్ట్ కిట్లు వినియోగిస్తామని చెబుతున్నారు.

గంజాయి, మత్తు పదార్థాలు సేవించిన వారిని పరీక్షల ద్వారా గుర్తించి వారిని మత్తు పదార్థాల వినియోగం నుంచి దూరం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక చేపట్టారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై మహబూబాబాద్ పోలీసులు ముప్పేట దాడికి దిగుతుండడంతో త్వరలో మహబూబాబాద్ జిల్లా గంజాయి రహిత జిల్లాగా ఆవిర్భవించడం ఖాయంగా చెబుతున్నారు.



ప్రతి ఒక్కరూ 

సహకరించాలి..

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం అరికట్టడానికి జిల్లా ప్రజలు సహకరించాలని, సంపూర్ణ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అక్రమ రవాణాను ఆదాయం అనరుగా భావిస్తున్న వారిపట్ల కఠినంగా ఉంటామని, తెలిసి తెలియక దాడి తప్పిన యువతను డి అడిక్షన్ సెంటర్ల ద్వారా సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. మంచి మార్పు కోసం చేస్తున్న కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని, ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించడానికి సహకరించాలని, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు కలిసి పునాదులు వేయాలని, యువత భవిష్యత్తు కు బంగారు బాటలు వేయడానికి కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాల సమాచారం వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, 5000 రూపాయలు నగదు పురస్కారం కూడా అందిస్తామని ఎస్పీ ప్రకటించారు.

- డాక్టర్ శబరిష్, 

ఎస్పీ, మహబూబాబాద్