28 May, 2026 | 5:05 AM

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

28-05-2026 12:29 AM
  1. 33 తులాల బంగారం, 71 తులాల వెండి ఆభరణాల స్వాధీనం...
  2. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్...

ఆదిలాబాద్, మే 27 (విజయక్రాంతి) : తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలు, దారి దొపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాతో పాటు వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలలో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పట్టుకుని వారి వద్ద నుంచి 33 తులాల బంగారం, 71 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ఢిల్లీకి చెందిన వారు కాగా మిగతా ఇద్దరు నాగ్ పూర్ వాసులని తెలియజేశారు.

తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న జైచంద్, ప్రేమ్ షాలిక్ రాం ఖత్రి, సతేంద్ర గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారన్నారు. వారి నుండి 33 తులాల బంగారం, 71 తులాల వెండి అభరాణలతో పాటు షిఫ్ట్ కారు, నాలుగు సెల్ ఫోన్లు, 15 వేల నగదును చోరికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠా చోరీలతో పాటు గతంలో దారి దొపిడి, చైన్ స్నాచింగ్, హత్యా యత్నం, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు.

సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకోగలిగామని.. ప్రతి ఒక్కరూ విధిగా సిసి కెమెరాలు బిగించుకోవడంతో పాటు ఊళ్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా చూడాలని సూచించారు. అనేక నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించినపోలీసులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్త్స్ర అశోక్, ఆర్‌ఎస్త్స్ర గోపి, సంజయ్, రమేష్, హన్మంతు, శ్రీను, జాకీర్, ఆర్‌ఎస్ రమేష్, రుక్మారెడ్డి, రహత్ అలీ, ఐటీ కోర్ సిబ్బంది కానిస్టేబుల్ త్రిశూల్ పాల్గొన్నారు.