5 August, 2026 | 2:42 AM

కామారెడ్డిలో 45 మంది ప్రయాణికులను రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది

05-08-2026 01:46 AM

కామారెడ్డిలో అర్థరాత్రి పెళ్లికి వెళ్తున్న బృందాన్ని రక్షించిన వైనం

కామారెడ్డి, ఆగస్ట్ 4 (విజయక్రాంతి): కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రైవేట్ బస్సులో వెళుతున్న పెళ్లి బృందం వరద నీటిలో చిక్కు కోవడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్పందించి రక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో సుభాష్ టాకీస్  సమీపంలో రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి నుండి రంగంపేటకు పెళ్లి కార్యక్రమానికి అర్ధరాత్రి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో బస్సు మధ్య రోడ్డులోనే నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు, ఫైర్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసి, రోడ్డుపై వేగంగా ప్రవహిస్తున్న నీటిని లెక్కచేయకుండా రోప్ సహాయంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అనంతరం ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించారు.

పోలీసు, ఫైర్ శాఖల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. పెళ్లి బృందాన్ని సకాలంలో రక్షించి వారిని వేరే వాహనంలో పంపించడంలో పోలీసులు చూపిన చొరవను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ‘భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దు అని అన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి‘ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.