గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) బుధవారం హర్దోయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మీరట్‌ను ప్రయాగ్‌రాజ్‌తో అనుసంధానించే ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేను(PM Modi inaugurates Ganga Expressway) ప్రారంభించారు. వారణాసిలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... గంగామాతా ఆశీర్వాదం వల్లే.. ఈ ప్రాజక్టు సాకారమైందని తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేకు గంగా మాతా పేరుపెట్టుకోవడం సంతోషకరమన్నారు. గంగా మాతా వేల సంవత్సరాలుగా ఈ దేశానికి జీవన రేఖగా ఉందన్నారు. ఈ గంగా ఎక్స్ ప్రెస్ వే యూపీ అభివృద్ధికి కొత్త జీవనరేఖగా నిలుస్తుందని సూచించారు.
గంగా ఎక్స్ ప్రెస్ వే(Ganga Expressway) నిర్మాణంతో యూపీ ముఖచిత్రం మారిపోయిందన్న మోదీ ఐదేళ్లలోనే భారీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే భారీ ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యిందన్నారు. భారీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం ఐదేళ్లలోనే పూర్తి చేశామని వివరించారు. ఇది కేవలం ఎక్స్ ప్రెస్ వే కాదు.. యూపీ అభివృద్ధి, కలల సాకారానికి రాజమార్గం అన్నారు. కొందరు యూపీని బీమారు రాష్ట్రం అని సంబోధించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని ఇవాళ యూపీ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారిందని సూచించారు.
యూపీ మూడు ట్రిలియన్ డాలర్(UP three trillion dollars) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. దేశానికి రెండు డిఫెన్స్ కారిడార్లు మంజూరు చేస్తే.. ఒకటి యూపీ పొందిందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ లో భారీ ఆధిక్యంతో బీజేపీ గెలుస్తోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ లో ఈ సారి నిర్భీతి వాతావరణంలో పోలింగ్ జరుగుతోందన్నారు. బెంగాల్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివెళ్తున్నారని సూచించారు. బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న గుజరాత్ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించిందని తెలిపారు. మే 4న ఫలితాలు వెలువడే 5రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.






