6 March, 2026 | 3:50 AM

ఎడతెగని పెదవాగు సమస్య

06-03-2026 12:00 AM
  1. తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ప్రాజెక్టు

గతేడాది జూలైలో గండి.. తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మాణం

తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టు.. ఏపీలో మేజర్ ఆయకట్టు 

పట్టించుకోని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు

మరమ్మతులు లేక శిథిలావస్థకు

రెండు సీజన్లు కోల్పోయిన ఆయకట్టు రైతులు

అశ్వారావుపేట, మార్చి 5 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి వద్ద 1976లో నిర్మించిన పెదవాగు మధ్యతరహా ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతూ, ఎడతెగని సమస్యగా మారింది. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కు చెందిన 16వేల ఎకరాలు ఆయుకట్టుకు ఈ ప్రాజెక్టు నీరందిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఆశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ప్రాజెక్టు ఆయుకట్టు విస్తరించి ఉండగా.. రాష్ట్ర విభజన సమయంలో పెదవాగు ప్రాజెక్టు కింద ఉన్న భూముల్లో సుమారు 2వేల ఎకరాలు అశ్వారావుపేట మండలంలో మిగిలింది.

మిగిలిన 14వేల ఎకరాలు పోలవరం ముంపు ప్రాంతాలుగా ఏపీలోకి వెళ్లిన వేలేరుపాడు మండలంలో 7వేల ఎకరాలు, కుక్కునూరు మండలంలో 7 వేల ఎకరాల ఆయుకట్టు చేరిపోయింది. అంటే ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, మేజర్ ఆయ కట్టు ఏపీలోకి వెళ్లింది. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టుకు దుర్గతి పట్టింది. రాష్ట్ర విభజనతో ప్రాజెక్టును పట్టించుకున్న వారే లేరు. మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కూడా పట్టించుకోలేదు.

2024లో భారీ గండి

దశాబ్దకాలంపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోక, అటు ఏపీ నుంచి సహకారం అందక తెలంగాణా పరిధిలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రాల సమస్యగా మిగిలిన ఈ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పట్టించుకోలేదు. దీంతో 2024 జూలైలో కురిసిన భారీ వర్గానికి ‘పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. కట్టపైన అనేక చోట్ల చిన్నచిన్న గండ్లు పడ్డాయి.

ఈ వరదల్లో గుమ్మడపల్లి గ్రామం, ఏపీ, తెలంగాణాలోని వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. అనంతరం తాత్కాలికంగా తెలంగాణలోని భూములకు తాత్కాలికంగా సాగునీరందించాలనే ఉద్దేశంతో రూ.3 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు లోపల రింగ్ బండ్ నిర్మించారు. 2025 వర్షాకాలం నాటికి ప్రాజెక్టు కట్టను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటామని చెప్పిం ది. మరమ్మతులు, కాలువల నిర్మాణం కోసం రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఇరు ప్రభుత్వాల ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ఏమైందో కానీ ఫైల్ అనుకున్నంత వేగంగా కదలకపోవడంతో రైతులు గత సీజన్‌ను కోల్పోయారు. మళ్లీ 2026 సీజన్  వచ్చేస్తుంది.

ఈ సీజన్ పంటలకైనా అందాలంటే ఇప్పటికే మరమ్మతుల పనులు ప్రారంభమైతేకానీ సమయం. చాలదు. కానీ ఇప్పటి వరకు ఈ ఫైలుకు పరిపాలన మంజూరు తప్ప ఆర్థిక, సాంకేతిక అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఉమ్మడి సమ స్యలు తీర్చాల్సిన గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమస్య పరిష్కారంలో తగినంత చొరవ చూపించడంలేదన్న విమర్శలు న్నాయి. ఇప్పటికే రెండు పంటలు కోల్పోవడం ద్వారా వేలాది మంది రైతులు రూ. కోట్లలో నష్టపోగా, వచ్చే సీజన్ కైన అందుబాటులోకి వస్తుందో లేదో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన పెదవాగు ప్రాజెక్టుకు ముప్పును తెచ్చి పెట్టగా, వేలాది రైతులకు నష్టాన్ని  మిగిల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్‌లో కట్ట గండిని పూడ్చకపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా గోదావరిలో కలిసింది. ఇప్పటికైనా వచ్చే సీజన్ నాటికి ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని ఆయుకట్టు రైతులు కోరుతున్నారు.