వైన్స్‌షాపులో దొరకని మద్యం.. బెల్ట్ షాపుల్లో పుష్కలం
- మద్యం స్టాక్ పాయింట్ వద్ద నిలువు దోపిడీ
ఒక్కో మద్యం సీసాపై అదనంగా రూ.25 బాదుడు
అన్ని బ్రాండ్లు దొరికే చోటు బెల్ట్ షాపులు మాత్రమే
ఇష్టారాజ్యంగా వైన్స్ షాపు నిర్వాహకుల ఆగడాలు
నెలవారీ మామూళ్లతో నిద్రావస్థలో సంబంధిత శాఖ
అధికారుల అండదండలతో దండుకుంటున్న వైన్స్ నిర్వాహకులు
మద్యం మత్తులో చిత్తవుతున్న రోజువారీ కూలీల బ్రతుకులు
గుండాల, మార్చి 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలో వైన్స్ షాపు నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ, మండల అధికారుల అండదండలతో అధిక ధరలకు మద్యం విక్రయాలు కొనసాగిస్తూ మూడు బీర్లు, ఆరు క్వార్టర్లుగా అందినకాడికి దండుకుంటున్నారు. దానికి తోడు వారి వ్యాపార అభివృద్ధికి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ జోరుగా అధిక లాభాలతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతూ, కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైన్స్ నిర్వాహకులు స్టాక్ పాయింట్ వద్ద మద్యాన్ని బెల్ట్ షాపులకు ఒక్కొక్క బాటిల్ పై ఎంఆర్పీ ధర కంటే రూ.25 కు అధికంగా విక్రయిస్తే, బెల్ట్ షాపు నిర్వాహకులు మరో రూ.25 జత చేసి అమ్ముతున్నారని, వైన్స్ షాపులో డిమాండ్ ఉన్న మద్యాన్ని అమ్మకపోగా, సమయపాలన పాటించకపోవడంతో మా జేబుకు చిల్లులు పడుతున్నాయని మద్యం ప్రియులు వాపోతున్నారు.
ఇంత దోపిడీ జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ కానీ, కనీసం మండల అధికారులు కానీ మాకు సంబంధం లేదని, నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ అధికారిక టోల్ ఫ్రీ నెంబరైన 18004252523 కు మద్యం ప్రియులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని బ్రాండ్లు దొరికే చోటు బెల్ట్ షాపులు మాత్రమే
మండల కేంద్రంలో ఉన్న ఒక్క వైన్స్ షాపులో ఎంఆర్పీకి మద్యాన్ని విక్రయిస్తున్నా, అన్ని బ్రాండ్లు మద్యం ప్రియులకు సరఫరా చేయాల్సి ఉండగా అలా సరఫరా చేస్తే బెల్ట్ షాపులు ఎలా నడుస్తాయి, తమ పెట్టుబడి త్వరగా రావాలనే ఆలోచనతో వైన్స్ షాప్ నిర్వాహకులు కొన్ని మద్యం బ్రాండ్లనే అందుబాటులో ఉంచి విక్రయిస్తూ, విరివిగా అమ్ముడయ్యే బ్రాండ్లను స్టాక్ పాయింట్ ద్వారా బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ దండిగా లాభాలు ఆర్జిస్తున్నారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
నెలవారీ మామూళ్లతో నిద్రావస్థలో అధికారులు
వైన్స్ షాప్ నిర్వాహకులు ఇచ్చే నెలవారీ మామూళ్లతో సంబంధిత ఎక్సైజ్ శాఖ, మండల అధికారులు మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నా, వైన్స్ షాపులో అన్ని బ్రాండ్లు దొరకకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, తమకేం సంబంధం లేనట్టు నిద్రావస్థలో జోగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతీ నెల వారికి వైన్స్ నిర్వాహకులు మామూళ్ళు ముట్టజెప్పి బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ, తమ పని తాము చక్క పెట్టుకుంటున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారు చేసిన వారిపై, విక్రయించే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటూ, మద్యంపై దృష్టి పెట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.
మద్యం మత్తులో చిత్తవుతున్న రోజువారీ కూలీల బ్రతుకులు
రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ కూలీలు పొద్దంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా బెల్ట్ షాపులు, వైన్స్ షాపులో దారపోస్తుంటే తమ కుటుంబాలు ఎలా బాగుపడతాయని నిరుపేద కుటుంబాలలోని మహిళలు తమ గోడును ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ధీనావస్థలో తమ రోజువారీ బ్రతుకులను నెట్టుకొస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న తమ మగవారితో రోజు వాగ్వాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వాపోతున్నారు.
మండలంలోని కొంత మంది ప్రశ్నించే వారి గొంతును వైన్స్ నిర్వాహకులు ఎంతో కొంత అప్పజెప్పి నోరు మూపిస్తున్నట్లు సమాచారం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై, వైన్స్ షాప్ నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, పలు రాజకీయ నాయకులు, మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




