6 March, 2026 | 3:45 AM

మొబైల్‌తో ముప్పు.. కలగాలి కనువిప్పు

06-03-2026 01:29 AM

మొబైల్ వ్యసనంగా మారకముందే మార్పు తేవాలి 

తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి 

వివిధ రంగాల్లో రాణింపుకు కృషి చేయాలి

తుంగతుర్తి, మార్చి 5 :  నేటి కాలంలో పిల్లలు సరిగ్గా చదవకపోవడం, ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకుని ఉండటం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించే విషయం. సమస్య రానురాను మరింత జటిలంగా మారుతుంది. అందుకే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కేవలం మాటలతో సరిదిద్దే విషయం కాదు. దీని వెనుక లోతైన మెదడు పనితీరు  దాగి ఉంది.  దీనిని ఎలా సరిచేయాలనే విషయం పూర్తి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కథనం..

 తల్లిదండ్రులే మొదటి రోల్ మోడల్స్..

పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. మీరు రోజంతా మొబైల్లో ఉంటూ పిల్లలను చదువుకోమంటే అది సాధ్యం కాదు.

 పరిష్కారం : ఇంట్లో కనీసం రాత్రిపూట ఒక గంటను ‘నో గ్యాడ్జెట్ అవర్‘  గా పాటించాలి. ఆ సమయంలో అందరూ మొబైల్స్ పక్కన పెట్టి మాట్లాడుకోవాలి

వ్యసనంగా మారకముందే మార్పు తేవాలి..

మొబైల్ వాడకం వల్ల పిల్లల మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది, ఇది వారికి అలవాటుగా మారి వ్యసనంగా మారుతుంది. దీనిని మార్చడానికి మెదడులోని పాత అలవాట్ల మార్గాలను  బ్రేక్ చేయాలి 

 పరిష్కారం : ఫోన్ స్థానంలో ఇతర ఆసక్తికరమైన పనులు ప్రవేశపెట్టాలి. వారి మెదడుకు మొబైల్ కంటే మెరుగైన ఉత్సాహం ఇతర పనుల్లో దొరికేలా చేయాలి.

 తల్లిదండ్రులు సమయం కేటాయించాలి : 

పిల్లలు ఒంటరిగా ఫీల్ అయినప్పుడే ఎక్కువగా ఫోన్ వైపు మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులు వారితో కలిసి ఆడుకోవడం లేదా వారి సమస్యలను వినడం వల్ల వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది

 చదువుపై ఆసక్తినీ పెంచాలి..

చదువును ఒక శిక్షగా కాకుండా, ఒక సరదా ప్రక్రియగా మార్చాలి. పిల్లల గ్రేడ్ల కంటే, వారు నేర్చుకునే విషయంపై దృష్టి పెట్టాలి. ప్రతి చిన్న విజయాన్ని అభినందించండి. అప్పుడే వారికి చదువుపై ఆసక్తి పెరుగుతుంది.

వివిధ రంగాల్లో రాణింపుకు కృషి చేయాలి..

ఒకవేళ మీ పిల్లలు మొబైల్ లేకపోతే విపరీతమైన కోపానికి గురవుతున్నా, లేదా పూర్తిగా చదువుపై దృష్టి కోల్పోయినా.. కేవలం మాటలతో అది సెట్ కాదు. అప్పుడు వివిధ సంస్థల ద్వారా డీప్ లెవెల్ కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం. కుటుంబం పిల్లల ప్రయోజనాల దృష్ట్యా మొదటినుంచి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడం మరిపించే విధంగా వ్యాయామాలు, ఆటలు , డాన్స్ రంగాలలో  రాణించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు, జరుగుతున్న వేళ, మార్పు కోసం, మనందరం.. కృషి చేద్దాం.