ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మొయినాబాద్ ఆగస్టు 30 (విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాకారం జాగీర్ గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ సూచించారు. ఆదివారం బాకారం జాగీర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో లిమ్స్ న్యూరో కార్డియో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో రోగులకు వివిధ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి, యూరాలజీ, చర్మ, కంటి తదితర విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ యాదవ్, ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






