31 August, 2026 | 1:36 AM

భూభారతితో కాంగ్రెస్ దోపిడీ

31-08-2026 12:33 AM
  1. నగర ప్రజలకు శాపం క్యూర్ చట్టం
  2. 43 శాతం క్రైమ్ రేట్ పెరగడం విచారకరం
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపణ
  4. కుత్బుల్లాపూర్‌లో బీజేపీ కార్యాలయం ప్రారంభం

మేడ్చల్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ధరణి పేరుతో బీఆర్‌ఎస్, భూభారతి పేరుతో కాంగ్రెస్ నాయకులు పేద ప్రజలను దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌కు చేటు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 22 ఏ నిషేధిత జాబితా వల్ల పేద ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. క్యూర్ చట్టం ప్రజలకు శాపంగా మారిందని, పన్నుల భారం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 43 శాతం క్రైమ్ రేట్ పెరగడం విచారకరమన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రైమ్ రేట్ పెరగడానికి కారణమేమిటో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో 15 శాతం కమిషన్ ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్ల ప్రభుత్వమని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఇలా అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీయేనని భావిస్తున్నారని చెప్పారు. 5న ఇందిరాపార్క్ వద్ద, 7న మహాధర్నా నిర్వహిస్తామని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.