28 August, 2026 | 4:29 AM

పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

27-08-2026 04:51 PM

తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం మరువలేనిది

మెడికల్‌ కళాశాలకు పెద్ది సుదర్శన్‌ రెడ్డి పేరు పెట్టాలి

ప్రతి నియోజకవర్గంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి

ఆశయ సాధనకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ 

భూపాలపల్లి, ఆగస్టు 27 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మాజీ లోక్‌సభ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంచితనం, పేరు మాత్రమే శాశ్వతంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభను జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ మెడికల్‌ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టడంతో పాటు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించాలని నాయకులు పేర్కొన్నారు.