13 April, 2026 | 6:07 PM

భిక్కనూర్ లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

13-04-2026 05:19 PM

భిక్కనూరు,(విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యం రవాణాను  ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం జాతీయ రహదారి-44పై ఉన్న భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, డీఎస్పీ శేఖర్ రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కిష్టయ్యల బృందం ముందస్తు సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, భారీగా పీడీఎఫ్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది.

అధికారులు లారీ నుంచి సుమారు 285-290 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారం వెనుక హైదరాబాద్‌కు చెందిన నాగరాజు ఉన్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ అసదుల్లా ఆలంను అదుపులోకి తీసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పంచనామా నిర్వహించి ఎఫ్‌సీఐ గోదాంలకు తరలించారు. ఈ చర్యల్లో భిక్కనూరు ఎస్‌ఐ ఆంజనేయులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.