27 June, 2026 | 3:18 PM

షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ

27-06-2026 02:11 PM

సిబ్బంది గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వీర్లపల్లి శంకర్ 

సెలవు పత్రాలు లేకుండానే విధులకు గైర్హాజరు..?

షాద్ నగర్ జూన్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను మరిచి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొట్టడం సరైన పద్ధతి కాదని ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తీరుపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లింగారెడ్డిగూడ గ్రామంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలువురు సిబ్బంది గైర్హాజరుగా ఉండటం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. కార్యాలయంలో ఉద్యోగుల హాజరు పరిస్థితిని పరిశీలించిన ఆయన, సిబ్బంది హాజరు పట్టికను తెప్పించి స్వయంగా పరిశీలించారు. విధులకు హాజరుకాని ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్డీవో ఎన్.ఆర్. సరిత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైనట్లు సిబ్బంది ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడగా, ఆమె అధికారిక విధుల్లో భాగంగా జిల్లా కార్యాలయంలో ఉన్నట్లు తెలిపారు. అయితే కీలక మరో అధికారి, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక జూనియర్ అసిస్టెంట్‌తో పాటు మరికొందరు సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన ఉద్యోగులు సెలవు దరఖాస్తులు సమర్పించారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. హాజరు పట్టికలో పేర్లు చదివిస్తూ, సంబంధిత ఉద్యోగులు ఎందుకు విధులకు రాలేదని ప్రశ్నించారు. ఒకవేళ సెలవులో ఉంటే సంబంధిత సెలవు పత్రాలను చూపించాలని కోరారు. కొంతమంది ఉద్యోగులు మౌఖికంగా సమాచారం ఇచ్చి వెళ్లారని సిబ్బంది చెప్పగా, ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో విధి నిర్వహణకు సంబంధించి ప్రతిదీ రికార్డుల్లో ఉండాలని, మౌఖిక సమాచారం సరిపోదని స్పష్టం చేశారు.

అధికారి కార్యాలయంలో లేరనే కారణంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. సెలవు తీసుకుంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన పత్రాలు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి  అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, అదే సమయంలో ప్రజలు వివిధ అవసరాల కోసం ఆర్డీవో కార్యాలయానికి వస్తుంటారని గుర్తు చేశారు. అలాంటి సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వ్యాఖ్యానించారు. విధులకు హాజరైన సిబ్బంది వివరాలను కూడా ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన ఉద్యోగుల పేర్లను ప్రత్యేకంగా నమోదు చేసుకొని, కార్యాలయ పనితీరుపై సమగ్ర వివరాలు సేకరించారు.