పాలేరు చేరిన సాగర్ జలాలు
కూసుమంచి, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయానికి నాగార్జునసాగర్ జలాలు చేరుకున్నాయి. వేసవి ప్రభావం, వర్షాల లేమి కారణంగా జలాశయంలో నీటిమట్టం అడుగంటిపోవడంతో, అధికారులు సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు. తాజా పరిస్థితుల ప్రకారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల తాగునీటి ఇబ్బందులను తీర్చడానికి అధికారులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని వదిలారు. రోజుకు 4,000 క్యూసెక్కుల ప్రత్యేక ప్రవాహంతో నీరు పాలేరుకు చేరుకుంటోంది. 2.5 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం గల పాలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.1 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. జలాశయంలో నీటిమట్టం సుమారు 1 టీఎంసీ స్థాయికి చేరేవరకు లేదా మరో 1.4 టీఎంసీల నీటిని నిల్వ చేసేవరకు ఈ నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.






