పార్టీలకు అతీతంగా అభివృద్ధి
మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణ పరిదిలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. గురువారం మెట్ పల్లి పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరవై రెండు అంశాలను పొందుపరుచగా ఆయా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో వీది దీపాల సమస్య అధికంగా ఉన్నదని అలాగే నాణ్యమైన విద్యుత్ దీపాలను బిగించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు.
వార్డులలో కల్వర్టులు మురికి కాలువలు కూలిపోయాయని వాటిని వెంటనే నిర్మించాలని, అలాగే నూతన సి.సి రోడ్లు నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరినారు.ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా అన్ని వార్డులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రజలు శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, మున్సిపల్ కమిషనర్ డి. శ్రీనివాస్ గౌడ్, డి. ఇ.ఇ నాగేశ్వరరావు, కౌన్సిలర్స్ , కో- ఆప్షన్ సభ్యులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.






