30 July, 2026 | 9:45 PM

ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం

30-07-2026 08:38 PM

స్త్రీనిధి ఎన్నికల్లో విజయం సాధించిన హీనా బేగంకు అభినందనలు

మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచన

నాగల్ గిద్ద,(విజయక్రాంతి): స్త్రీనిధి క్రెడిట్ ఫెడరేషన్ పాలకవర్గ ఎన్నికల్లో సంగారెడ్డి–మెదక్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా ఘన విజయం సాధించిన హీనా బేగంను నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గురువారం తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ... మహిళల ఆర్థిక సాధికారతలో స్త్రీనిధి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

అలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు సంగారెడ్డి–మెదక్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా హీనా బేగం ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ, అర్హులైన మహిళలకు స్త్రీనిధి రుణాలు సకాలంలో అందేలా కృషి చేయాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం హీనా బేగం మాట్లాడుతూ... తన విజయానికి సహకరించిన సంగారెడ్డి–మెదక్ ఉమ్మడి జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అండగా నిలిచి ప్రోత్సహించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారి మార్గదర్శకత్వంలో మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం అంకితభావంతో పనిచేస్తానని, స్త్రీనిధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి మహిళకు చేరేలా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రహీం, స్థానిక నాయకులు గౌస్ చిస్తీ, వివిధ మండలాల సర్పంచులు తయాబ్, శాంతప్ప (ఔదత్పూర్) తదితరులు పాల్గొన్నారు.