30 July, 2026 | 9:25 PM

Breaking News

బోధన్ సీనియర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం   •   ఎస్సారెస్పీలోకి భారీ వరద   •   కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి   •   సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •  

నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!

30-07-2026 08:14 PM

* మన్ననూరు సమీపంలో పూర్వకాలపు రాతి ద్వారం ముందు దర్శనం

* ఇతర ప్రాంతం నుంచి తెచ్చి వదిలారా?

అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా నంది విగ్రహం ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న నిరంజన్‌ షావలి దర్గా వెనుక భాగంలో, ప్రతాపరుద్రుని కోటకు వెళ్లే పూర్వకాలపు రాతి ద్వారం ముందు గురువారం ఉదయం ప్రయాణికులకు నంది విగ్రహం కనిపించింది.

* గుర్తు తెలియని వ్యక్తులు తెచ్చారా?

ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. నల్లరంగులో ఉన్న నంది విగ్రహాన్ని ఇతర ప్రాంతం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగుల పొడవు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

* వాహనం వచ్చిన ఆనవాళ్లు?

విగ్రహాన్ని ఉంచిన ప్రాంతం వరకు వాహనం వచ్చి వెళ్లినట్లుగా కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో అసలు ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు ఇక్కడ వదిలి వెళ్లారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

* అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి

చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి సమీపంలో నంది విగ్రహం అకస్మాత్తుగా కనిపించడంతో స్థానికుల్లో ఆసక్తితో పాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ, పురావస్తు శాఖల అధికారులు స్పందించి విగ్రహం ప్రాచీనమైనదా? ఇటీవలే తీసుకొచ్చి ఉంచారా? అనే అంశాలపై పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు. విగ్రహం అక్కడికి ఎలా చేరిందన్న దానిపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.