15 May, 2026 | 3:27 AM

మూడేళ్లుగా కమ్యూనిటీ హాల్‌లోనే జీవనం

15-05-2026 01:38 AM

దక్కని ఇందిరమ్మ ఇల్లు దళిత కుటుంబానికి దిక్కేది

గజ్వేల్, మే14: మూడేళ్లుగా కమ్యూనిటీ హాల్ లోనే జీవనం గడుపుతున్నా ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు దక్కలేదు. గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో  శ్యామల కొడుకుతో జీవనం సాగిస్తుంది. పదేళ్ల క్రితం భర్త కనకరాజు మృతి చెందగా, అనారోగ్య కారణంగా అత్త మామ కూడా చనిపోయారు. మూడేళ్ల క్రితం భారీ వర్షాలకు ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో నివాసం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న 70 గజాల స్థలంలో తన మంగళసూత్రం అమ్మేసి  బేస్మెంట్ నిర్మించుకుంది. ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులాలిగా శ్యామల పేరు కూడా వచ్చింది.

అయితే అధికారులు శ్యామల వద్దకు రాగా, తమ స్థలంలో నిర్మించిన బేస్మెంట్ను అధికారులకు చూపించారు. బేస్మెంట్ ఉంటే ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పడంతో బేస్మెంట్ పూర్తిగా కూల్చివేసింది. మళ్లీ అధికారులను సంప్రదించగా అధికారులు రేపు ఎల్లుండి వచ్చి ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తామంటూ కాలయాపన చేశారు. ఇప్పటికీ అధికారులు శ్యామలకు ఇంటిని మంజూరు చేయలేదు. ఈ విషయమై అధికారులను మూడు రోజులుగా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు తన కష్టాన్ని అర్థం చేసుకొని ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని శ్యామల కోరుతుంది.

 మూడేళ్లుగా కమ్యూనిటీ హాల్ లోనే ఉంటున్నాం

 పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అత్త మామ కూడా అనారోగ్యంతో చనిపోయారు. వానకు ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. దిక్కులేని పరిస్థితిలో కమ్యూనిటీ హాల్ లోనే మూడేళ్లుగా కొడుకుతో కలిసి ఉంటున్న. ఎవరు పట్టించుకోలేదు.  ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి అండగా నిలబడి ఆదుకోవాలి.  

- -శ్యామల, కోమటి బండ 

రెండో విడతలో ఇల్లు మంజూరుకు కృషి చేస్తాం  

  అకాల వర్షానికి ఇల్లు కోల్పోయి గత మూడేళ్లుగా శ్యామల కమ్యూనిటీ హాల్ లో నివాసం ఉంటున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్యామలకు ఇల్లు మంజూరు చేయగా సాంకేతిక కారణాలవల్ల ఆమె ఇల్లు నిర్మించుకోలేక పోయింది. అందుకే రెండో విడతలో ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేశాం. మంజూరు కాగానే ఇంటి నిర్మాణానికి చర్యలు చేపడతాం.

- - తూం అమరేందర్, కోమటిబండ సర్పంచ్