15 May, 2026 | 3:06 AM

మూడేళ్లైనా ముందుకు సాగని పనులు!

15-05-2026 02:00 AM
  1. హుజూర్ నగర్, నేరేడుచర్లలో పిల్లర్ లు దాటని సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు 
  2. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం.                                     
  3. వీటి ఏర్పాటుకు రూ.4 కోట్లు కేటాయింపు
  4. ఎన్నికలు కారణంగా నిలిచిన పనులు
  5. మార్కెట్ నిర్మాణ పనులను పునరుద్దించాలని స్థానికుల వేడుకోలు

హుజూర్ నగర్, మే 14 : ప్రజలకు నిత్యం అవసరమైన అన్ని వస్తువులు ఒకే దగ్గర లభ్యమయ్యే విధంగా ఉండాలన్న సంకల్పంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న సమీకృత మార్కెట్లను హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు మజూరి చేసింది.

వీటిని ఏర్పాటు చేయడానికి హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని ఎన్‌ఎస్పి క్యాంపు స్థలం అన్నింటికి అనుగుణమైనది అని పరిశీలించి పనులు ప్రారంభించారు. ఒక్కో మార్కెట్కు రూ.2 కోట్ల నిధులను కేటాయించగా హుజూర్ నగర్ తో పాటు నేరేడుచర్ల సైతం కొంత మేరకు పనులు చేపట్టారు. అయితే ఈ పనులు ప్రారంభించి ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన వాటి నిర్మాణం పిల్లర్లు దాటకపోవడం గమనార్హం.   

ఎన్నికల నోటిఫికేషన్‌తో నిలిచిన పనులు

సమీకృత మార్కెట్ పనులు జరుగుతున్న క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పనులు మధ్యలోనే అధికారులు నిలిపివేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంబంధిత అధికారులు సమీకృత మార్కెట్ పనులను పరిశీలించి పనులు మొదలు పెట్టి పూర్తి చేయించాలనే అలోచన విరమించారు. మంజూరైన నిధులు ఏమైయిన్నట్లో ఎవరికి తెలియదు.

ప్రజలు ఒక్కో వస్తువు కోసం వివిధ చోట్లకు వెళ్లకుండా అన్నీ ఒకే చోట లభించే విధంగా ఉండాలన్న ఉద్ధేశంతో ఏర్పాటు చేస్తున్న సమీకృత మార్కెట్ పనులు గాలికి వదిలేశారు. కోట్ల రూపాయలతో ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ పనుల గురించి ఆరా తీసిన దాఖలాలు కనిపించడం లేదని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా...:

హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో కొంత మేరకు నిర్మాణం చేసి వదిలేసిన సమీకృత మార్కెట్లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయంలో మందు బాబులకు నిలయంగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

హుజూర్ నగర్ నగర నడిబొడ్డున మార్కెట్ పనులు ప్రారంభించక అసంపూర్తిగా ఉండటంతో రాత్రి అయిందంటే మందు బాబులతోపాటు కొంతమంది రకరకాల కార్యకలాపాలకు అడ్డా చేసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటిని నిర్మాణంపై దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయించి వివిధ రకాల వస్తువుల కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. అధికారులు సైతం దీని ప్రాధాన్యతను వివరించి త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

పనులు ప్రారంభమయ్యేలా కృషి

సమీకృత మార్కెట్ పనులను గత ప్రభుత్వం రెండు కోట్ల నిధులను మంజూరు చేసింది వాస్తవమే. సమీకృత మార్కెట్ ప్లాన్ ను అప్పటి ప్రభుత్వం మార్పులు చేయడంతో అంచనా వ్యయం భారీగా పెరగడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.

శ్రీనివాస్, హుజూర్ నగర్ 

మున్సిపాలిటీ కమిషనర్