20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయండి
- నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ మోతిలాల్ నాయక్ డిమాండ్
- ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరుద్యోగుల రణభేరి
ముషీరాబాద్, జూలై 15(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని, వెంటనే నోటిఫికేషన్ వేయకపోతే రెండు రోజుల తర్వాత దిల్‌సుఖ్‌నగర్ ఎవరెస్ట్ ఇనిస్టిట్యూట్ వద్ద సత్యాగ్రహ దీక్షను చేపడతామని తెలంగా ణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ మోతిలాల్ నాయక్ హెచ్చరించారు.
20 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ బుధవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు దరావత్ మోతిలా ల్ నాయక్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ధరావత్ మోతిలాల్ మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్ కోసం ఉద్యమం చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఏ నిరుద్యోగులైతే గెలిపించారో అదే నిరుద్యోగులతో ‘కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో’ అనే ఉద్యమాన్ని నిర్వహిస్తామని, రాష్టంలో ప్రతి చౌరస్తాలో డప్పు చప్పుళ్ల్లతో ఉద్యమం నిర్మించి రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి తీరుతామని హెచ్చరించారు.
ఢిల్లీ నడి బొడ్డున కూడా ‘కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో‘ తో పాటు ‘దేశ్ బచావో’ అనే ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా తిరిగి నిర్మిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నేత వినోద్ నాయక్, ఝాన్సీ, కౌశిక్, రాజు, విక్రమ్, శ్రీనివాస్, రంగా నాయక్, సాయి ప్రణత్, ప్రదీప్, పోలీస్ జేఏసీ ప్రతినిధి నవీన్ గౌడ్ పాల్గొన్నారు.






