‘పాలమూరు-రంగారెడ్డి’ జాతీయ హోదా లేదు
- గణనీయ నీటి సామర్థ్యమున్న వాటికే హోదా
- డీపీఆర్‌ను తెలంగాణకే పంపాం
- డిప్యూటీ సీఎం ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఏ ప్రధాన నీటిపారు దల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం తెలిపి న వివరాల ప్రకారం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)కు అందిందన్నారు.
ఈ పథకం ద్వారా ఆశించిన ప్రయోజనాలు సమగ్రంగా ఎలా సాధ్యమవుతాయనే అంశంపై ప్రణాళిక రూపొందించి పంపాలని సూచిస్తూ, డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే ప్రమాణాలు పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ, నేషనల్ ప్రాజెక్ట్స్ మార్గదర్శకాలలో నిర్దేశించి ఉందని పేర్కొన్నారు. గణనీయమైన సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించే ప్రాజెక్టులకే జాతీయ హోదా కల్పిస్తామని విస్పష్టం చేశారు.






