24 July, 2026 | 3:00 AM

కార్గో బలోపేతానికి కేంద్రం చర్యలు

24-07-2026 01:59 AM
  1. పీఎం గతిశక్తి ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి
  2. ఎంపీ డీకే అరుణ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): దేశంలో విమాన కార్గో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ, కృషి ఉడాన్ పథకం అమలు, విమాన కార్గో టెర్మినళ్ల విస్తరణ, నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్‌తో అనుసంధానం, ఎగుమతుల కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎంపీ డీకే అరుణ కేంద్రాన్ని ప్రశ్నించారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా దేశంలోని విమాన కార్గో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

భారతీయ కార్గో విమానాలు, ప్యాసింజర్ -టు -కార్గో (పీ2సీ) విమానాలకు ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు వివరించారు. కర్ణాటకలో కూడా కార్గో టెర్మినళ్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్గో సదుపాయాలు, ఫార్మా జోన్లు, డిజిటల్ వ్యవస్థలు, పేపర్‌లెస్ కార్గో ప్రాసెసింగ్ వంటి చర్యలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మురళీధర్ తెలిపారు.