24 July, 2026 | 4:09 AM

ప్రభుత్వంపై నమ్మకం పోయింది

24-07-2026 01:48 AM

హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం

వివాదాస్పద ఆస్తికి రక్షణగా సైన్యం ఉండాలి 

ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎవరినైనా నిర్బంధించాలని వెల్లడి 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం హైడ్రా వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఒక ప్రైవేట్ యాజమాన్యంలోని వివాదాస్పద ఆస్తికి రక్షణగా ఉండాలని గురువారం భారత సైన్యాన్ని ఆదేశించింది.

హైడ్రా తమ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడంతో రాష్ట్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలపై తమకు విశ్వాసం పోయిందని హైకోర్టు పేర్కొంది. శాంత శ్రీరామ్ కన్స్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతున్నప్పుడు జస్టిస్ అనిల్‌కుమార్ జుకంటి ఈ ఉత్తర్వును జారీ చేశారు. భూమిని పరిరక్షిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ లోతుకుంటలోని తమ ఆస్తిలోకి హైడ్రా అక్రమంగా ప్రవేశించిందని ఆ కంపెనీ ఆరోపించింది.

ఇలాంటి విషయాల్లో సైన్యాన్ని జోక్యం చేసుకోనివ్వకూడదనే ఉద్దేశం కోర్టుకు ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై మాకు నమ్మకం పోయినందువల్లే అలా చేస్తున్నాం. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏం జరుగుతుందో తెలియాలి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే ఆర్మీ బైసన్ డివిజన్‌లోని అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించమని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. శుక్రవారం లోగా వివాదాస్పద ఆస్తి వద్ద 10మంది సిబ్బందిని మోహరించాలని సైన్యాన్ని కోరింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆ ప్రాంగణంలోకి ప్రవేశించిన హైడ్రా అధికారులతో సహా ఎవరినైనా సైన్యం నిర్బంధించవచ్చని జస్టిస్ జుకంటి పేర్కొన్నారు. ‘అక్కడ సైనిక సిబ్బందిని మోహరించాలి. ఆ ప్రదేశంలోకి ప్రవేశించే హైడ్రాతో సహా ఎవరినైనా వారు అదుపులోకి తీసుకుని బ్యారక్‌లకు తరలించాలని.. వాహనాలను కూడా స్వాధీనం చేసుకోండి’ అని న్యాయమూర్తి అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వివాదాస్పద ఆస్తిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించారన్న విషయాన్ని ఖండించారు.

అయితే ఆ స్థలంలో హైడ్రా వాహనాలు ఉన్నట్లుగా పిటిషనర్ సమర్పించిన ఫొటోలను ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఆ ఫొటోలు గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్‌కు న్యాయపరమైన రక్షణ కల్పించినప్పటికీ, హైడ్రా ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవడం కొనసాగించిందన్న ఆరోపణల ఆధారంగా ఈ ధిక్కార కేసు నమోదైంది. జూలై 21న కేసులో జస్టిస్ జుకంటి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను అరెస్టు చేయమని ఆదేశించవచ్చని హెచ్చరించారు.

ఒకవేళ అలాంటి చర్య అవసరమైతే పోలీసు సిబ్బంది అక్కడే ఉండాలని కూడా కోర్టు వెల్లడించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగవని అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టుకు హామీ ఇవ్వడంతో జడ్జి చర్యను వాయిదా వేశారు. అయితే ఆ హామీ ఇచ్చినప్పటికీ హైడ్రా తమ ఆదేశాలను మూడవసారి ఉల్లంఘించిందని గురువారం ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఒకసారికాదు ఏకంగా మూడుసార్లు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు.