‘పాలమూరు--’ మరింత వేగం
- భూసేకరణకు మరో రూ.587 కోట్లు
- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ వరుస సమీక్షలు
- 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
- ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
హైదరాబాద్, జూన్ ౬ (విజయక్రాంతి): దక్షిణ తెలంగాణలో సాగునీటి రంగానికి గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయ డంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. కొంతకాలంగా నెమ్మదించిన పనులను మళ్లీ వేగవంతం చేస్తూ ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భూసే కరణ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు తాజాగా రూ.587 కోట్ల అదనపు నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 2028 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కీలక అంశంగా మారడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేకదృష్టి సారించింది.
ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూ ముల స్వాధీనం పూర్తయినప్పటికీ, కొన్ని గ్రామాల్లో పరిహారం చెల్లింపులు, సర్వేలు, పునరావాస కార్యక్రమాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యలు నిర్మాణ పను లకు ఆటంకంగా మారకుండా జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని అధికారులను ప్రభు త్వం ఆదేశించింది. రైతులతో చర్చలు జరిపి, భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.
నిధుల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యం
పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించిన ప్రభుత్వం, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఇటీవల ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు స్థితిగతులను సమీక్షించారు. పెండింగ్ పనులు, భూసేకరణ, నిధుల విడుదల, నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించి, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహి స్తూ ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టే ప్రయ త్నం చేస్తున్నారు. అవసరమైతే వారానికోసారి సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేస్తూ ఈ ప్రాజెక్టు కోసం రూ.1,800 కోట్లకు పైగా నిధులు కేటాయించింది.
కాంట్రాక్టర్ల బిల్లు లు, నిర్మాణ సామగ్రి, భూసేకరణ పరిహారం వంటి అంశాల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందు లూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, టన్నెల్స్, కాల్వల నిర్మా ణం వంటి కీలక పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే దక్షిణ తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా, 1,226 గ్రామాలకు తాగునీటి సదుపాయం కల్పించనుంది. దశాబ్దాలుగా కరవు, వలసలు, వర్షాధార వ్యవసాయంతో ఇబ్బందులు పడుతున్న పాలమూరు ప్రాంతానికి ఈ ప్రాజెక్టు జీవనాడిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజాగా భూసేకరణ కోసం నిధుల విడుదల, పనుల వేగవంతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాలమూరు ప్రాంత ప్రజల్లో ఆశలు పెరిగాయి. ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ తెలంగాణ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సి ఉంది.






