పాక్ మారణహోమం
- కాబూల్ ఆసుపత్రిపై భీకర దాడులు
- 400 మంది మృతి.. మృతులసంఖ్య పెరిగే అవకాశం
కాబూల్, మార్చి 17: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాధాన్ని మిగిల్చాయి. సోమవారంరాత్రి మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు చికిత్స అందిస్తున్న ‘ఒమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్’ లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు క్షిపణులతో బీభత్సంగా దాడులు చేశాయి.
ఈ దాడుల్లో ఇప్పటివరకు 400 మంది మృత్యువుపాలు కాగా మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పాక్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు రెండువేల పడకల సామర్థ్యం కలిగిన ఈ భారీ ఆసుపత్రి భవనం కుప్పకూలింది. వందలాది మంది రోగులు నిద్రలో ఉండటంతో వందల సంఖ్యలో మృతుల్లో ఎక్కువ మంది పేద రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు.
అయితే, పాకిస్తాన్ ఈ ఆరోపణను ‘అసత్యం, తప్పుదోవ పట్టించేది’ అని ఖండించింది. సోమవారం రాత్రి తమ దాడులు కచ్చితమైనవని, కేవలం సైనిక స్థావరాలు, ఉగ్రవాద మద్దతు మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.పౌర ఆసుపత్రిపై దాడి చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇది మానవత్వానికి వ్యతిరేకమైన నేరమని తాలిబన్ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మండిపడ్డారు.
ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధితుల కుటుంబాలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్ (యునామా) సంతాపం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల పౌరులు తీవ్రంగా నష్టపోతున్నారని ఐక్యరాజ్యసమితి మిషన్ పేర్కొంది. ఈ దాడులపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలను పరిష్కరించడానికి చర్చలు, సంప్రదింపులు మాత్రమే సమర్థవంతమైన మార్గమని ఆయన అన్నారు.
పాకిస్థాన్ చర్య క్షమించరానిది: భారత విదేశాంగ శాఖ
కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సైనిక చర్య ముసుగులో జరిగిన మారణహోమం అని, పాకిస్థాన్ చర్య క్షమించరానిదని మండిపడింది.
పాక్ చేపట్టిన ఈ దుశ్చర్య ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దారుణమైన దాడి అని, ఇది ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ప్రత్యక్ష ముప్పు అని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, కరుణకు ప్రతీకగా భావించే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడికి పాల్పడటం మరింత హేయమైన చర్య అని భారత్ పేర్కొంది.




