9 June, 2026 | 2:46 AM

కంచర్లలో రోడ్డు పైనే ధాన్యం బస్తాలు.. రైతుల ఆవేదన

09-06-2026 01:47 AM

భిక్కనూర్, జూన్ 8(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యం, ధాన్యం బస్తాలు రోడ్డు పైనే ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. గత నెల 5వ తేదీన కోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కొనుగోలు, తరలింపు జరగలేదని తెలిపారు.

ప్రతి వర్షానికి ధాన్యం తడవకుండా కాపాడేందుకు రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ట్రాక్టర్ల కొరత కారణంగా తూకం వేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడం ఆలస్యమవుతోందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి అదనపు వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యం బస్తాల తరలింపును వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.