28 July, 2026 | 2:59 PM

లోన్ పేరుతో మహిళకు రూ.6.70 లక్షల టోకరా

28-07-2026 02:06 PM

- ఫోటో మార్ఫింగ్‌తో బెదిరింపులు.. రూ.3.20 లక్షలు హోల్డ్

బూర్గంపాడు,(విజయక్రాంతి): లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.6.70 లక్షలు కాజేసిన సైబర్ మోసం బూర్గంపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌతాపురం కాలనీకి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు రుణం ఇప్పిస్తామని చెప్పి ఆధార్, పాన్ తదితర వ్యక్తిగత వివరాలను సేకరించారు. అనంతరం ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపుతూ, డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామని బెదిరించారు.

దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు విడతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి, మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన నగదులో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించడంలో సఫలమయ్యారు. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

జాగ్రత్తలు పాటించాలి

లోన్ల పేరుతో అపరిచితులకు ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు. ఫోటో మార్ఫింగ్, సైబర్ బెదిరింపులు లేదా ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.