19 June, 2026 | 3:31 AM

వైకల్యాన్ని జయించి ‘లా’లో పీహెచ్‌డీ

19-06-2026 02:29 AM

సూర్యాపేట జిల్లా గుడుగుంట్లపాలెంలో హర్షాతిరేకాలు

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): వైకల్యాన్ని జయించి, ఆర్థిక ఇబ్బందులను సవాల్‌గా స్వీకరించి ‘లా’ విభాగంలో పీహెచ్‌డీ పట్టాను సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంకు చెందిన కొప్పుల సంజీవ్‌రెడ్డి సాధించి ఔరా అనిపించుకుంటున్నాడు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో కొప్పుల జయరాంరెడ్డి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించాడు. తోబు ట్టువులు అక్క కళావతి, అన్నలు వెంకటరెడ్డి, సైదిరెడ్డి ఆర్థికంగా, మానసికంగా ప్రోత్సహించి ఉన్నత చదువుల వైపు సంజీవ్‌రెడ్డి నడిపిస్తూ ప్రోత్సహించారు.

న్యాయశాస్త్ర విద్యతో దివ్యాంగులకు అండగా నిలవచ్చని భావించి 2018లో పీహెచ్‌డీలో చేరారు. తెలంగాణలో దివ్యాంగుల సామాజిక, న్యాయపరమైన సమస్యలు, చట్టాల అమలు, న్యాయవ్యవస్థ పాత్రపై సంజీవ్‌రెడ్డి సమర్పించిన పరిశోధనా వ్యాసం ప్రశంసలు పొందింది.

ఈ వ్యాసం ఫ్రొఫెసర్ పంత్ నాయక్ పర్యవేక్షణలో వ్యాసం రూపుదిద్దుకుందని, తనకు అండగా నిలిచిన డీన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, బీఓఎస్ చైర్పర్సన్ రాధికా యాదవ్, ప్రొఫెసర్ విజయలక్ష్మి, నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాథమిక గురువు మందపుడి శంకరయ్య, చదివించిన మేనమామ గుండ్ర రాంరెడ్డి, ప్రోత్సహించిన డాక్టర్ సోమిరెడ్డి శ్రవణ్ రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు ‘డాక్టరేట్’ సాధించడంపై గుడుగుంట్లపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.