24 April, 2026 | 9:10 PM

భయం గుప్పిట్లో ఖానాపూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతాలు

24-04-2026 07:35 PM

పట్టణానికి సమీపంలో దట్టమైన అడవి, చెట్ల పొదలతో భయం భయం..

రెండు రోజుల క్రితం పాముకాటుతో వ్యక్తి మృతి

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మునిసిపాలిటీ శివారు ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్ళదీస్తున్నారు. దీనికి కారణం పట్టణంలో పలు కాలనీలో చెట్లపోదులు, ముండ్ల పొదలతో నిండిపోవడం, పట్టణానికి సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్, చుట్టూ చెరువులు, ఉండడంతో విషపురుగులు కాలనీలోకి వచ్చి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం పట్టణంలోని రాజీవ్ నగర్, జెకె నగర్, ప్రాంతంలో గల ఒక ఇంట్లో పాముకాటుతో వ్యక్తి చనిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు భయాందోళన చెందుతున్నారు.

దీనికి కారణం ఆయా కాలనీలో రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, చెట్లపొదులు పెరిగిపోవడం, వాటి నిర్వహణ లేకపోవడంతో విష పురుగులు, పందులకు ఆవాసంగా మారుతున్నాయి. దానికి తోడు పట్టణానికి చివరన ఉన్న జెకే నగర్, శాంతినగర్, విద్యానగర్, ఇందిరానగర్, తదితర కాలనీలు శివారులో ఉండడంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో నని భయపడుతున్నారు. దానికి తోడు మొన్నటి వరకు మున్సిపాలిటీ పాలకవర్గం కొలువు తీరకపోవడం నిర్వహణ పనుల్లో కొంత జాప్యం జరగడంతో పొదలు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని పలువురు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా నూతన పాలకవర్గం ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకొని పారిశుభ్రత చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. ప్రాముఖ్యంగా శివారు కాలనీలలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం పలువురిని కలవర పెడుతున్నాయి.