8 March, 2026 | 12:44 PM

మరణాన్ని జయించిన మానవత్వం పరిమళించింది

08-03-2026 10:39 AM

- ఆరుగురి ప్రాణాల్లో వెలుగు నింపిన యాదమ్మ

- పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి కుటుంబం ముందుకు

మునుగోడు,(విజయక్రాంతి): మనిషి మరణించినా తన అవయవాల ద్వారా మరో రూపంలో జీవించవచ్చని ఒక కుటుంబం నిరూపించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఇతరుల ప్రాణాల గురించి ఆలోచించిన వారి నిర్ణయం ప్రస్తుతం మర్రిగూడ మండలంలో చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన చెరుకు యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైంది. ఇప్పటికే భర్తను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.

వివాహమైన కుమార్తె, ఇంకా స్థిరపడని కుమారుడు ఉన్న కుటుంబంలో యాదమ్మ మరణంతో ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది.తల్లి ఇక తిరిగి రాదని తెలిసినా, ఆమెను మరో రూపంలో బ్రతికించాలని కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. యాదమ్మ అవయవాలను దానం చేయడంతో మృత్యువు అంచుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులకు కొత్త జీవితం లభించింది. కష్టకాలంలోనూ స్వార్థం చూడకుండా సమాజం కోసం వారు చూపిన మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

అమ్మ భౌతికంగా మాకు దూరమైనా… ఆరుగురి ప్రాణాల్లో అమ్మ శ్వాస సజీవంగా ఉంటుంది” అని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పిన మాటలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి.

అవయవ దానం – ప్రాణాలకు వెలుగు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేస్తే హృదయం, కాలేయం, మూత్రపిండాలు, కళ్ల వంటి అవయవాల ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు. సమాజంలో అవయవ దానంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. యాదమ్మ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఈ దిశగా ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.