16 July, 2026 | 12:51 AM

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి

16-07-2026 12:36 AM

క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలి 

సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పెట్టె

కలెక్టర్ రాజర్షిషా

సోనాల (ఆదిలాబాద్), జూలై 15 (విజయక్రాంతి): విద్యార్థులు సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి పట్టుదలతో క్రమశిక్షణతో చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం జిల్లాలోని సోనాల మండల కేంద్రంలోని పిఏంశ్రీ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట రాగి జావ వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థులు జంక్ ఫుడ్స్, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశామని, దీని ద్వారా వచ్చే ఫిర్యాదులను హెచ్‌ఎంతో కలిసి కమిటీ స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తుందన్నారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లను కేవలం చదువు కోసమే ఉపయోగించాలని, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి డీఆర్డీఓ సహకారంతో న్యూట్రీ గార్డెన్స్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో గ్రంథాలయం, న్యూట్రి గార్డెన్లను ప్రారంభించి మొక్కను నాటి నీరు పోశారు. కలెక్టర్ వెంట ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, తహశీల్దార్ మల్లేష్, ఎంపీడీవో రత్నాకర్ రావు, ఎంఈఓ ఉస్సేన్, సర్పంచ్ బిందుజ, ప్రధానోపాధ్యాయులు సచిన్, విద్యాశాఖ సిబ్బంది అజయ్, వీడీసీ సభ్యులు తుల శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.