శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రాజేష్ చంద్ర
తాడ్వాయి, జూన్, 17 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లోని రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి ఎలా ఉంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడారు. పోలీసులకు ఉండే ప్రాథమిక దర్యాప్తు విధానాలు, నేర పరిశోధనలు ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి మర్యాదగా ఉండాలని సూచించారు. చట్ట పరిధిలోనే కచ్చితంగా విధులు నిర్వహించాలని ఆయన సిబ్బందికి స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిత గతిన పూర్తిచేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఎస్త్స్ర నరేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






