23 August, 2026 | 12:51 AM

సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగుతో రైతులకు సిరులు

22-08-2026 11:53 PM

మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి

నంగునూరు,(విజయక్రాంతి): కాళేశ్వరం జలాలతో సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు సరికొత్త నాంది పలికిందని, దీంతో రైతులకు మంచి ఆదాయం సమకూరుతోందని మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం  సిద్దిపేట నియోజకవర్గంలోని నర్మేట ఆయిల్ పామ్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ప్రాంగణమంతా కలియతిరిగి, పామాయిల్ తయారీ విధానాన్ని ప్రశాంత్ రెడ్డికి హరీష్ రావు వివరించారు.

ఆయిల్ పామ్ సాగుతో లాభాలు పొందుతున్న రైతుల ఆనందం చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ అనతికాలంలోనే 60 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్ పూర్తి చేయడం అద్భుతమైన విజయమని నాయకులు కొనియాడారు.ఇదే ఫ్యాక్టరీలో రిఫైనరీ కూడా ఏర్పాటు చేయనున్నామని, ఆ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు నర్సరీల్లో తగినన్ని అందుబాటులో ఉన్నాయి.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే,క్రషింగ్ కోసం వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని వారు సూచించారు.ఆయన వెంట మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అనుకోని లింగం గౌడ్, సర్పంచ్ శనిగరం స్వాతి –బాబు,పిఎసిఎస్ చైర్మన్లు రమేష్ గౌడ్,మహిపాల్ రెడ్డి, నాయకులు సోమిరెడ్డి, బెదురు తిరుపతి,బద్దిపడగ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.